develop free website

నీ దోనెను లోతునకు నడిపించు

లూకా 5:1-10... 

లూకా 5:1-10... ప్రియ చదువరి! దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ఈ 10 వచనములలో క్రైస్తవ జీవతములోని 3 స్థితులు మీ ముందు ఉంచుతాను. నీవు చేయవలసిన పని, నీవు ఏ స్థితిలో ఉన్నావో పర్రీక్షించుకోవాలి. 

 ముందుగా పది వచనముల సారాంశము గమనించుదాం. ఒక రోజు యేసు గేన్నేసరెతు సరస్సు తీరమున ఉన్న సమయములో అక్కడ కొందరు జాలరులు తమ వలలు కడుగుకొనుచున్నారు, ఆ జాలరులలో ఒకడు సీమోను పేతురు. యేసు సీమోను పేతురు దోనెలో ఉండి జనసమూహమునకు బోధించిన తరువాత సీమోనుతో నీ దోనెను లోతునకు నడిపించి వలవేయుమని చెప్పినప్పుడు, పేతురు యేసుతో రాత్రి అంతయు ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు అని చెప్పి, యేసు చెప్పినట్లు వలవేసి విస్తారమైన చేపలు పట్టినారు. అప్పటినుండి యేసు పెతురుని మనుష్యులను పట్టు జాలరినిగా వాడుకుంటారు. ఇది ఈ పది వచనముల సారాంశము.

క్రైస్తవ జీవితములో మొదటి స్థితిని గమనించుదాము:

యేసు పెతురుని కనుగొనిన సమయములో పేతురు స్థితిని గమనిస్తే – పేతురు రాత్రంతా కస్టపడి ఏమి దొరకక ఒట్టి చేతులతో తీరం చేరినాడు. ఇటువంటి పరిస్థితిలో పేతురి మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఎంతో నిరుత్సాహంతో బాధతో పేతురు ఉన్నాడు అని నేను భావిస్తున్నాను. మనిషి ఎంత సంతోషించిన ఒక క్షణం ఓటమి, బాధ భరించలేడు. ఈ బాధను భరించలేక అనేకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మనిషికి సంతోషం కావాలి, ప్రతి క్షణం కావాలని కోరుకుంటాడు. పేతురు ప్రొఫెషనల్ వేటగాడు కాని, ఆ రోజు ఏమి సంపాదించలేక పోయాడు. ఈ పరిస్థితిలో యేసు పెతురుని కనుగొని వాక్యం బోధించాడు (౩వ).

ప్రియ చదువరి! ఇది క్రైస్తవ జీవితములో మొదటి స్థితి. క్రీస్తు లేని జీవితం పేతురు కలిగియున్నాడు. నిరుత్సాహం బాధల్ పేతురు ఉన్నాడు. ఇది చదువుచున్న నీవు ఈ స్థితిలో ఉన్నావా? జీవితంలో ఓడిపోయావా? భరించలేని బాధలో మునిగియున్నవా? ఎందుకు ఈ జీవితం చనిపోతే బాగుండు అనే ఆలోచనలతో ఉన్నావా? ఒక వేళ నీవు ఈ స్థితిలో ఉంటే నీకు కావలసిఉంది ఒకటే వాక్యం. వాక్యం నీ ప్రతి సమస్యకు పరిష్కారం. ఎవరిని ఆశ్రయించిన ఎంత ధనం బలగం ఉన్నా నీ జీవితములో వాక్యం లేకపోతే అనగా క్రీస్తు లేకపోతే ఏమి సాధించలేవు. దోనె జీవితమునకు సాదృశ్యం. నిరుత్సాహంలో ఉన్న పేతురు జీవితములోనికి యేసు రావడానికి ఇష్టపడినాడు, పేతురు తన దోనెలోనికి (జీవితములోనికి) క్రీస్తుని ఆహ్వానించాడు. నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను (లూకా 19:10). నశించిపోయేది కాదు, నశించినదానిని రక్షించుటకే యేసు ఈ లోకమునకు వచ్చెను. మనం నశించిపోయిన వారము. కాని, ఆయన మహా కృపను బట్టి మనం నేడు సజీవుల లెక్కలో ఉన్నాము. నీవు ఈ మొదటి స్థితిలో ఉంటే నేడే నీ పాపములు ఒప్పుకో. నీ జీవితములోనికి యేసుని ఆహ్వానించు. నూతన జీవితము క్రీస్తుని కలిగిన జీవితమును పొందుకో...

క్రైస్తవ జీవితములో రెండవ స్థితిని గమనించుదాము:

 క్రీస్తుని తన జీవితములోనికి ఆహ్వానించిన పేతురుతో, వాక్యం వినిన పేతురుతో యేసు ఈ విధముగా మాట్లాడుచున్నాడు. (4వ) నీవు దోనెను లోతునకు నడిపించు. రక్షించబడిన క్రైస్తవుడు లోతునకు వెళ్ళాలి. సంఘములో నటబడాలి. వాక్యములో వేరుపారాలి. ఆత్మీయ జీవితములో లోతునకు వెళ్ళినప్పుడు జరిగే కొన్ని లక్షణాలు మీకు చూపిస్తాను. వీటిని బట్టి ఆత్మీయ జీవితములో నీవు ఎలా ఉన్నవో పరీక్షించుకొనవచ్చు.

1.(5వ) దేవుని మాట వింటాము : యేసు పేతురుని లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని చెప్పినప్పుడు పేతురు ఇచ్చిన సమాధానం; రాత్రంతయు ప్రయాసపడితిమి మాకేమి దొరకలేదు అని, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని దేవుని మాటకు లోబడినాడు. ఇక్కడ పేతురు తన అనుభవం జ్ఞానం ప్రక్కన పెట్టి క్రీస్తు మాటకు లోబడినాడు. రక్షించబడిన క్రైస్తవుడు ఆత్మీయ జీవితములో లోతునకు వెళ్ళినప్పుడు కనిపించే మొదటి లక్షణం దేవుని మాట వెంటాడు తన జ్ఞానం అనుభవం పెంటతో సమానముగా ఎంచుకుంటాడు.

2.(6వ) అద్భుతాలను చూస్తాము : ఇప్పుడైతే పేతురు దేవుని మాటను విన్నాడో ఆ తరువాత జరిగిన కార్యం, అద్భుతం. తన అనుభవంతో జ్ఞానంతో ఎప్పుడు పట్టలేనన్ని చేపలు యేసు చెప్పిన మాట వినినప్పుడు పట్టినాడు. ఆత్మీయ జీవితములో లోతునకు వెళ్ళినప్పుడు కనిపించే రెండో లక్షణం అద్భుతాలను చూస్తాము అనుభవిస్తాము. ఆత్మీయ జీవితములో లోతునకు వెళ్ళడమంటే క్రీస్తు యొక్క శక్తి సామర్ధ్యాలు తెలుసుకోవడమే కాదు చూడాలి అనుభవించాలి.

3.(7వ,8వ) కాలక్షేపం చేయము: చేపలు పట్టుటకు వెళ్ళిన వారిలో ఒక్కటే ఆలోచన ఉంటుంది, పని ముగించుకోని త్వరగా ఇంటికి వెళ్లిపోవాలి. నీళ్ళ మధ్యలో పని మధ్య లో కాలక్షేపం చేయడు. తోటి వారితో పేతురి సంభాషణ కూడా వచ్చి తనకు సహయము చేయమనే పిలుస్తున్నాడు. వ్యర్ధమైన ముసల్లమ్మ ముచ్చట్లు మాట్లాడుటలేదు. ఆత్మీయ జీవితములో లోతునకు వెళ్ళినప్పుడు కనిపించే మూడవ లక్షణం వెనక ఉన్నవి మరచి విశ్వాసమును కాపాడుకోనుచు గురి యెద్దకే పరుగెత్తుతాము.

4.(9వ) తగ్గింపు స్వభావం కలిగియుంటాము : పేతురు యేసు మోకాళ్ల యెదుట సాగిలపడి తన పాపములు ఒప్పుకుంటున్నాడు. అనేకమంది క్రైస్తవులు రక్షించబడక ముందుకంటే రక్షించబడిన తరువాతనే ఘోరమైన నీచమైన పాపములు చేస్తుంటారు. పాపము చేస్తూ కూడా పరిశుద్దముగా ఉన్నట్లే భావిస్తుంటారు. పేరు కోసం, పొగడ్తల కొరకే. ఎదురు చూస్తారు. కాని, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మనకున్న జ్ఞానం తలాంతులు బలం సమస్తం క్రీస్తు ఇచ్చినవేనని ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. తన్ను తాను తగ్గించుకోనువాడు హేచింపబడును...ఈ వాక్యం ప్రతి క్రైస్తవుడు తన హృదయము మీద రాసుకోవాలి. ఇది ఆత్మీయ జీవితములో లోతునకు వెళ్ళినప్పుడు కనిపించే నాలుగో లాక్షణం.

క్రైస్తవ జీవితములో మూడవ స్థితిని గమనించుదాము:

 పేతురు యేసుని తన జీవితములోనికి ఆహ్వానించి వాక్యం విని లోతునకు వెళ్ళిన తరువాత (10వ)లో యేసు పేతురుతో ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టు వాడవైయుందువని చెప్పాడు. మనుష్యులను రక్షణలోనికి నడిపించలేని క్రైస్తవ జీవితం వ్యర్ధం అని నేను అంటాను. 2000 సం||ల క్రితం పరమును విడచి నీ కొరకు నా కొరకు ఆ పశువుల పాకలో రిక్తునిగా జన్మించి, అనేక శ్రమలు అనుభవించి ఆ సిలువలో చివరి ఆకరి రక్తపు బొట్టు వరకు కార్చి మరణించి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచిన ఆ సజీవమైన దేవునికి నీవు ఏ బహుమానం ఇస్తావు. నశించిపోయే వారికి సువార్త ప్రకటించి రక్షణ లోనికి నడిపించకుండా మనం ఏమి చేసినా దేవునికి సంతోషం ఉండడు.

 ప్రియ చదువరి! దేవుడు నిన్ను నన్ను ప్రేమించి రక్షించి సంఘములో చేర్చి, నేటి వరకు సజీవుల లెక్కలో ఉంచితే మనం మౌనముగా ఉండడం సరికాదు. రక్షణను దాచిపెడితే మనం క్షమించరాని పాపం చేసిన వారమౌతాము. క్రీస్తు ప్రేమను ఈ లోకములో ప్రకటించాలి. మన వృతి జాలరులం, మన పెట్టుబడి ప్రార్థన, మన వ్యాపారం ఆత్మల సంపాదనైయుండాలి...!

-Pas. Anil Andrewz